Welcome to my blog!

సాధారణంగా మథనం అనే మాటని ఒక నిరాశాజనిత పదంగా అభివర్ణిస్తారు. కాని ఈ వర్ణన సరియైనది కాదేమో అని నా అభిప్రాయము. ఒకసారి చరిత్ర చూస్తే క్షీర సాగర మథనం వల్ల లోక కంటకుడైన అసురుడు వధించబడ్డాడు. మేఘ మథనం వల్ల పుడమి తల్లి పచ్చని రంగు పూసుకుని జీవకోటికి శక్తినిస్తోంది. కాబట్టి మథనం వలన మేలు జరుగుతుందని విశ్వసిస్తూ, ఈ మనో మథనం లో సమాజం గురించి, జరుగుతున్న మంచి/చెడు సంఘటనల గురించి నా అభిప్రాయాలు తెలియజేయదల్చుకున్నాను. ఇవి కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే.

సలహాలు సదా స్వీకరించబడును. అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుట అభినందనీయము.



Please visit http://www.mangalagiricottons.com/

This is one of the very good attempts made to raise the fallen weaving profession in Mangalagiri, Guntur Dt., AndhraPradesh, India.

Sep 4, 2010

పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణసంకటం

ఈ బ్లాగు ప్రస్తుతం రాష్ట్రంలో వేడి వేడిగా నడుస్తున్న పరిస్థితులమీద, (నీచమైన)తెలివితో పావులను కదుపుతున్న పెద్దమనుషుల మీద, భవిష్యత్తు మార్చగల విద్యాలోకం గొర్రెలుగా మారుతున్న వైనం పట్ల జాలితో, రాస్తున్నది. పిల్లి చెలగాటం కనీసం ఎలుకకు అర్థమవుతుంది. కనీసం ఆ మాత్రం కూడా అర్థం కాని మన విద్యార్థుల(?) మీద జాలి పడటం తప్పు కాదేమో.

తెలంగాణ అంశం రోజు రోజుకీ శ్రుతిమించుతోంది. నిజానికి ఈ విషయంలో రాజకీయనాయకులకు కూడా స్పష్టత వున్నట్టు కనిపించడం లేదు. పార్టీలు రోజుకో మాట మాట్లాడుతున్నాయి, ఎవరినీ నొప్పించక తానొవ్వకుండా వుందామని. మొన్న జరిగిన ఉప ఎన్నికల(ఎక్కువ స్థానాల్లో జరగకపోయినా) ఫలితాల వల్ల కొంత స్పష్టత వచ్చింది. తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కావాలన్న భావన జనాల్లోకి వచ్చిందని తెలుస్తోంది. కాని తెలంగాణా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రాజకీయనాయకులు ఎంతగా దిగజారారో చెప్పుకుంటే సిగ్గుచేటు. ఒక చిన్న సందేహం, పాతిక జిల్లాలుగా వుండి, 42 మంది MPలు వున్నపుడే, మంచి ప్రాజెక్టులన్నీ ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడు తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక మిన్నకుండిపోయాం. మళ్ళీ ఇపుడు విభజన జరిగితే, ఏ ప్రాంతం వారికైనా దొరికేవి ఎంగిలి మెతుకులు మాత్రమే. అభివృధ్ధి, పురోగతి మాట సరే సరి.

ఇవన్నీ పక్కన పెడితే, ఈ రోజు మన చదువుల తండ్రి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి పుట్టినరోజు, ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ సందర్భంగా చదువుల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడదాం. కొన్ని రోజుల ముందు ఉస్మానియా యూనివర్సిటీ లో ఉపాధ్యాయలోకానికి తగిలిన గాయం అత్యంత దురదృష్టకర ఘటనల్లో ఒకటి. పేపరు వాల్యుయేషన్లో సీమాంధ్ర అధ్యాపకులు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా విద్యార్థులకు మార్కులు తగ్గిస్తున్నారు అని తెలంగాణా విద్యార్థులు(?) ఉపాధ్యాయుల మీద దాడి చేశారు. ఏ ఉపాధ్యాయుడైనా విద్యార్థి మంచి కోరుకుంటాడు తప్ప, కనీసం సొంత లాభం కూడా లేని ఇలాంటి పని చేస్తాడనుకోను. తెరాస నేత K. చంద్ర శేఖర్ గారు సీమాంధ్ర ఉపాధ్యాయుడు దిద్దిన పేపర్ లో ఒక అమ్మాయికి తక్కువ మార్కులొచ్చాయని, తరువాత రీవాల్యుయేషన్ తో ఆ అమ్మాయికి ఫస్టుక్లాసు మార్కులొచ్చాయని చెప్పారు. ఆ పేపరు ముందు ఎవరు దిద్దారో, తరువాత ఎవరు దిద్దారో మన నేత(?)గారికి ఎలా తెలిసిందో మరి, రీవాల్యుయేషన్ దరఖాస్తులో ఏ ప్రాంతం వారిచేత పేపరు దిద్దించాలి అని వుంటుందేమో, నాకు తెలియదులేండి. దొరికిన ప్రతీ అవకాశాన్నీ రాజకీయంగా వాడుకోవాలనుకునే ఇలాంటి చవకబారు నేతల చేతిలో రేపటి భవిష్యత్తు అని చెప్పుకునే నేటి యువత, విద్యార్థి పావులుగా మారుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, రేపు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత కూడా, వేరే ప్రాంతపు ఉపాధ్యాయులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, వేరే ప్రాంతపు విద్యార్థులకు మార్కులు ఎక్కువ వస్తున్నాయనీ, వేరే ప్రాంతం వారి వల్ల తెలంగాణాలో నిరుద్యోగం ఎక్కువవుతోందని ప్రతీ దానికి గొడవలు చేయరని గ్యారంటీ ఏంటి. తెలంగాణాలో కేవలం తెలంగాణా వారే వుండాలనుకోవడం బుద్దితక్కువ, అదే జరిగితే తెలంగాణా రాష్ట్ర మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అది మన నేత(?)లకు తెలుసు. కాని తలచుకుంటే ఏదైనా చేయగల యువతను, విద్యార్థులను రెచ్చగొట్టడానికి విద్య, ఉద్యోగాలను ఎరగా వేస్తూ ఆడిస్తున్న నాటకం ఇది, కాదంటారా! ప్రత్యేక రాష్ట్రం వస్తే కొత్త ఉద్యోగాలు పుడతాయి కాని దాని వల్ల తెలంగాణా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టడం చాలా తప్పు.

ఈ రోజు జరుగుతున్న APPSC పరీక్ష విషయంలో చేస్తున్న రభస కూడా చిత్రంగా వుంది. తెలంగాణా వచ్చేవరకు ఈ పరీక్షని నిరవధిక వాయిదా వేయాలని కోరడం హాస్యాస్పదం. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఇపుడు పరీక్ష జరిగితే తెలంగాణా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మళ్ళీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే, అందితే జుట్టు అందకపొతే కాళ్ళు అన్న చందాన, విద్యార్థులు పరీక్ష రాయడానికి సిధ్ధంగా లేరు, పరీక్ష రాసే వాతావరణం తెలంగాణాలో లేదని చెప్తున్నారు. విద్యార్థులని రాజకీయ కీచులాట లోకి లాగిందెవరు? వేరే పనులెన్ని వున్నా విద్యార్థి మొదటి కర్తవ్యం చదువు, విజ్ఞానం. కర్తవ్యాన్ని పక్కన పెట్టి రాజకీయ ఊడిగం చేయమని చెప్తున్న మన నేత(?)లను ఏమనాలి? APPSC పరీక్ష ఇవాళ జరిగితే, తరువాత జరిగే ప్రత్యామ్నాయాలకు ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వస్తుందని ఒక రాజకీయ నాయకుడు ఆవేశంతో ఊగిపొతూ చెప్తున్నాడు. ఏమిటి మనకీ దౌర్భాగ్యం? ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు జరగలేదు. దీని ఫలితం ఈ రోజు తెలియకపోయినా, ఒక సంవత్సరం వృధా ఐతే ఎంత నష్టపోతామో విద్యార్థులకు ముందు ముందు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏది ఎలా జరిగినా ఈ రోజు జరగాల్సిన పరీక్ష జరిగి తీరుతుందని ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం.

విద్యార్థులు మరియు యువత దేశభవిష్యత్తుని నిర్దేశించేవారు. రాజకీయాల పట్ల వారికి అవగాహన కలిగించడం, రాజకీయాలలోకి వారిని ప్రోత్సహించడం చాలా మంచి విషయం. రాజకీయ మేధావుల, రాజకీయ విశ్లేషకుల సత్సాంగత్యం వారికి మరియు దేశానికి ఎంతో మేలు చేస్తుంది. కాని ఇలా నీతి, విలువలు లేని నాయకులు చెప్పే చెప్పుడు మాటలకు, చూపించే తప్పుడు ఆశలకు లొంగిపోతే చివరకు మూల్యం చెల్లించుకునేది విద్యార్థులే. అపుడు మీ వెన్నుదన్నుగా వుంటామన్న నాయకులు కనుచూపుమేరలో కుడా వుండరు. జాగ్రత్త!

Feb 24, 2010

వార్తా మాధ్యమాలు

ఈ పోస్టులో పత్రికా స్వాతంత్ర్యం గురించి, నేడు చలామణిలో వున్న పత్రికలు మరియు వార్తా ఛానళ్ళ తీరు గురించి నా అభిప్రాయం చెప్పదలచుకున్నాను.

"అరే యార్, ఇధర్ ఆవ్,
దేఖో, ఆంధ్రుల దినపత్రిక!
పెట్టుబడికి,   కట్టుకథ   కి
పుట్టిన    విష పుత్రిక!!"

ఇవి నేనన్న మాటలు కావు. మహాకవి శ్రీ శ్రీ గారు 1970వ దశకంలో అన్న మాటలు. సందర్భానికి తగినదని ఇక్కడ ప్రస్తావించడమైనది. ఆయన మీద గౌరవమో, లేక ఎవరెన్ని చెప్పినా మేము ఇలాగే వుంటాము అని పరోక్షంగా చెప్పడమో నేటి పత్రికల(ఒకటో రెండో దీనికి మినహాయింపు అనుకుంటాను) చందము ఇప్పటికీ అలాగే వుంది. వార్తాఛానళ్ళ పరిస్థితి సరే సరి. గత 5 సంవత్సరాలలో పుట్టుకొచ్చిన కొత్త కొత్త వార్తా ఛానళ్ళ ఉధృతిలో సంపాదకవిలువలు కొట్టుకుపోయాయనడం అతిశయోక్తి కాదేమో. TRP రేటింగుల రేసులో కనీసవిలువలు గాలికొదిలేశారు. నిష్పక్షపాతంగా, ఎటువంటి భావావేశాలకు తావివ్వకుండా సమాజంలో జరుగుతున్న మంచి చెడు సంఘటనలను ప్రజలకు అందించవలసిన ఈ మాధ్యమాలు తమ కీర్తిప్రతిష్ఠలను పెంచుకోవాలన్న స్వార్థంతో రాజకీయ పార్టీ కరపత్రాలుగా మారిన వైనం అందరికి తెలిసిందే. నేడు చలామణిలో ఒక పత్రికను ఉదాహరణగా తీసుకుంటే, తమ రేటింగు పెంచుకోవడం కోసం తమ పత్రికలో అన్నీ కలర్ పేజీలే అని చెప్తుంది, లేని సర్క్యులేషన్ ను వున్నట్టుగా చూపిస్తుంది. అంతవరకు పర్లేదు. అది ఆ సదరు పత్రికా యజమాని ఇష్టం, ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతనే భరిస్తాడు కాబట్టి. కాని ఆ పత్రిక విషయానికి వస్తే, అది కేవలం కొంత మంది రాజకీయ వ్యక్తుల ప్రయోజనాలకోసం ఆవిర్భవించిన పత్రిక అన్నది బహిరంగసత్యం. ఈ తెర చాటు రాజకీయ నాయకులు తమ భాగోతాలను బయటపెడుతున్న మరొక పత్రిక మీద బురదచల్లటానికి, తమ పత్రికను కేవలం ఒక ఆయుధంగా వాడుకుంటూ చేస్తున్న బహిర్గతదాడిలో "ఏది నిజమో" అందరికీ తెలుసు. వీలైతే కీలక వ్యక్తులను బ్రతిమలాడో బెదిరించో తమ వైపుకు తిప్పుకోవడానికి కూడా వెనుకాడడంలేదు. వీరికి తమవారు చేస్తున్న నేరాలు, తప్పుల గురించి అణుమాత్రమైనా సమాచారం అందదు. రంగుపేజీల ముసుగులో, "సమాజానికి నిలువుటద్దం మా పత్రిక" అనే వాణిజ్యప్రకటనల హోరులో సామాన్య ప్రజలను మోసగించడం ఎలా సమర్ధించగలరు. ఇక విలువల గురించి మట్లాడడానికి నాకే సిగ్గుగా వుంది.

ఏదో ఒక సినిమాలో చెప్పినట్టుగా, అశ్లీల సాహిత్యం మన వార్తాఛానెళ్ళు చూపించినంత జనరంజకమైనపధ్ధతిలో ఇంకెవరూ చూపించలేరేమో! ఉదాహరణకు, కొద్దికాలం కిందట జరిగిన ఒక బాబాగారి పడకగది వ్యవహారం అంతా వార్తాఛానెళ్ళలో వీడియోప్రదర్శన నిర్వహించారు. కొన్ని అతిముఖ్యమైన సన్నివేశాలను మసకబార్చారనుకోండి. కాని మామూలు వాటి కన్నా, మసకచిత్రాల వెనుకనున్న నిజాన్ని చుడాలన్న ఉత్సుకత చాలా వుంటుంది. ఇందులో ఎటువంటి స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ లేదు, పైపెచ్చు వార్తలను సరియైన పధ్ధతిలో అందించలేకపోవడంవల్ల యువత పక్కదారి పట్టడానికి దారులు తెరుస్తున్నట్లవుతున్నది. ఇటువంటి ఆవేశాలను రెచ్చగొట్టడం ఎంతమాత్రం అభినందనీయం కాదు కదా. భాద్యత గల పత్రికలు, వార్తా ఛానెళ్ళు ఇలాంటి పనులు చేయడం సహించరానిది.

రాత్రి అందరూ నిద్రపోయాక(నిద్రపోయారు అనుకున్నాక) వచ్చే రియల్ స్టొరీస్ ని తెరకెక్కించే విధానం కుడా అలాగే వుంటుంది. ఖైదీలకు ఉరిశిక్ష అమలుచేసే తలారి నల్లటి దేహసౌందర్యంతో, మాసిన గడ్డంతో, బుర్ర మీసాలతో యముడికి ప్రతిరూపంగా వున్నట్లు, ఈ రియల్ స్టోరీస్ యాంకర్స్ కుడా అలాగే వుంటారు. విచిత్ర వేషధారణతో విచిత్ర హావభావాలతో నిజజీవితగాధలను వీరు తెరకెక్కించే తీరు ఒళ్ళుగగుర్పొడిచేలా వుంటుంది. వీటివల్ల ఎవరికి ఏమి ఒరుగుతుందో అర్థం కాదు.

నేను ఏ పత్రికను, ఏ ఛానెల్ ను సమర్థించట్లేదు. ఆయా సంస్థల వేళ్ళూనుకుపోయిన లోపాలను, స్వార్థపూరిత లక్ష్యాలను ఎత్తి చూపాలనుకుంటున్నాను.

కొంత ఆత్మావలోకనం చేసుకుంటే, మనం కూడా మారామనిపిస్తోంది. ఏ విషయమైనా మసాలా లేకుండా చెప్తే చాలా తక్కువమందికి అర్థం అవుతోంది. అదే విషయానికి కొన్ని వున్నవి లేనివి జోడించి మన బుధ్ధికి అంగీకారమైన పధ్ధతిలో చెప్తే బాగా అర్థం అవుతోంది. ఈ విషయాన్ని మనకన్నా ముందుగా ఆకళింపు చేసుకుని "మనః"కంగీకారమైన పధ్ధతిలో సమాచారాన్ని చేరవేయడంలో ఆరితేరిన పత్రికాసంపాదకులదే తప్పంతా అనడం ఎంతవరకు సమంజసం?

ఏది ఏమైనా నష్టం సమజానికే, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనకే. పారాహుషార్!

Feb 6, 2010

మూఢనమ్మకాలు

నా మొదటి బ్లాగ్ ని నేటి సమాజం లో వున్నఅర్థం లేని నమ్మకాల మీద నా అభిప్రాయం తో మొదలుపెట్టదలచుకున్నాను.

నేను విన్న ఒక చిన్న కథ చెప్తాను. "ఒక ఊరిలో ఒక గురువు గారు తన ఇంటి ఆవరణలో ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ వుండేవారు. రోజూ సాయంకాలానికి ప్రజలందరూ ఆయన ఇంటికి చేరేవారు. ఆయన ఇంట్లో వున్న ఒక పిల్లి సమావేశం జరుగుతున్నపుడు అటూ ఇటూ గెంతుతూ అందరికీ ఇబ్బంది కలిగించేది. దీనితో విసిగిపోయిన గురువు గారు రోజూ సమావేశం మొదలవడానికి ముందు పిల్లిని తన పక్కగా వున్న స్తంభానికి కట్టేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక గురువు గారు కాలం చేశారు. తరువాత గురువు గారి భాద్యత ని ఆయన కుమారుడు స్వీకరించాడు. ఆ రోజు సాయంత్రానికి ప్రజలందరూ ఆయన ఇంటికి చేరారు. గురువుగారి కుమారుడు కుడా వచ్చి కూర్చున్నాడు. కాని ఎంత సేపటికి సమావేశం మొదలుపెట్టట్లేదు. కాసేపు వేచి చూసాక అక్కడ కూర్చున్న ఒక పెద్దాయన లేచి కారణం అడిగాడు. గురువు గారి కుమారుడు చెప్పాడు, మా నాన్న గారు బ్రతికి వున్న రోజులలో సభ మొదలు పెట్టడానికి ముందు ఒక పిల్లి ని తెచ్చి ఇక్కడ కట్టేవారు, ఇపుడా పిల్లి పారిపాయింది. శిష్యులు వెతికి తేవడానికి వెళ్ళారు, పిల్లి దొరకగానే సమావేశం ప్రారంభిద్దాం అన్నాడు".

వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా నేడు ప్రజలలో వున్న నమ్మకాలు ఇలాగే వున్నాయి. మా అమ్మ ఇప్పటికీ చెప్తూ వుంటుంది, "రాత్రి వేళల్లో ఉప్పు అనకూడదు" అని. చిన్నపుడు ఎందుకు అలా అనకూడదో అర్థం అయ్యేది కాదు. కాని తరువాత నాకు తెలిసిందేమిటంటే పూర్వం ఇప్పుడున్నట్లుగా కరెంటు బల్బులు ఉండేవి కావు. రాత్రి వేళల్లో దీపాలు వెలిగించేవారు. ఉప్పు అంటే నోటినుంచి గాలి ఎక్కువగా వెలువడుతుంది, దానివల్ల దీపాలు ఆరిపోతాయని రాత్రి వేళల్లో ఉప్పు అనేవారు కాదు. కాని ఇపుడు పరిస్థితి మారిపోయింది. ఇపుడు ఉప్పు అనడం వలన ఏమి కాదు కదా! ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకూడదు అంటారు. ఎందుకో అర్థం కాలేదు. నాకు తెలిసిన ఒక పెద్దాయన చెప్పారు, "సాధారణంగా ఆషాఢమాసం సెప్టెంబర్/అక్టోబర్ లో వస్తుంది. ఆ సమయం లో కొత్తగా పెళ్ళైన దంపతులు కలిస్తే ఆ స్త్రీ గర్భం ధరించి నవమాసాలు గడిచే సరికి మే/జూన్ నెల వస్తుంది. అప్పుడు ఎండలు బాగా వుంటాయి, అసలే సౌకర్యాలు అరకొరగా వుండే పాతకాలంలో ఇబ్బందులు వస్తాయని ఆషాఢమాసం లో దంపతులను వేరుగా వుంచుతారు" అని. కాని ఇపుడు పరిస్థితి అలా లేదు కదా! చక్కటి వైద్యసదుపాయాలు అందుబాటులో వున్నాయి. ఒక ఫోన్ కాల్ దూరంలో 108 సర్వీసులు వున్నాయి. పరిస్థితి చాలా మెరుగుపడింది. కానీ ఇప్పటికి కుడా అదే ఆచారం పాటిస్తున్నారు. ఇవే కావు, "ఒంటి బ్రాహ్మణుడు ఎదురుపడకూడదు", "భర్త పోయిన స్త్రీ ఎదురుపడకూడదు", "ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు", "బయల్దేరేటపుడు తుమ్మకూడదు" ఇలాంటివి ఎన్నో వున్నాయి. మన పెద్దలు చెప్పినవి తప్పు అనట్లేదు నేను. మన పెద్దవారు చాలా విజ్ఞత కలిగినవారు. వారు చెప్పిన ప్రతిదానికీ ఏదో ఒక కారణం ఖచ్చితంగా వుంటుంది. కానీ వారు చెప్పిన వాటిలో చాలా వరకు అప్పటి కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా వున్నాయి. ఇప్పటి కాలానికి, పరిస్థితులకు తగ్గట్లుగా వాటిని విశ్లేషించి సవరించాల్సిన అవసరం, భాద్యత ఎంతైనా వుంది. అది వారిని ఎంతమాత్రము అగౌరవపరచినట్లు కాదు. వారి బాటలో నడవడం అంటే వారు చెప్పింది గుడ్డిగా నమ్మి పాటించడం కాదు. వారి ఆదర్శాలను పునాదిగా చేసుకుంటూ కొత్త భవంతులు నిర్మిద్దాం మరియు మన భవిష్యత్తువారికి బాటలు వేద్దాం.

Feb 3, 2010

Blog గురించి ఒక చిన్న మాట...

సాధారణంగా మథనం అనే మాటని ఒక నిరాశాజనిత పదంగా అభివర్ణిస్తారు. కాని వర్ణన సరియైనది కాదేమో అని నా అభిప్రాయము. ఒకసారి చరిత్ర చూస్తే క్షీర సాగర మథనం వల్ల లోక కంటకుడైన అసురుడు వధించబడ్డాడు. మేఘ మథనం వల్ల పుడమి తల్లి పచ్చని రంగు పూసుకుని జీవకోటికి శక్తినిస్తోంది. కాబట్టి మథనం వలన మేలు జరుగుతుందని విశ్వసిస్తూ, మనో మథనం లో సమాజం గురించి, జరుగుతున్న మంచి/చెడు సంఘటనల గురించి నా అభిప్రాయాలు తెలియజేయదల్చుకున్నాను. ఇవి కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే.

సలహాలు సదా స్వీకరించబడును. అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుట అభినందనీయము.